ట్యాక్సీవాలా తెలుగు రివ్యూ

Starring : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్, కళ్యాణి, కిరీటి, ఉత్తేజ్ , చమ్మక్ చంద్ర

Director : రాహుల్ సంకృత్యన్

Producers : ఎస్కేఎన్

Music Director : జేక్స్ బిజోయ్

Release Date : 17 నవంబర్

Espicy Rating:

‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. ‘ట్యాక్సీవాలా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్. కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లలో అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసమని హైదరాబాద్ వస్తాడు. రకరకాల ఉద్యోగాలు చేసి.. చివరికి వాటన్నిటికంటే మెరుగైందని భావించి క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అతడి దగ్గరున్న తక్కువ డబ్బులకు పాతికేళ్ల ముందు నాటి పాత కారు మాత్రమే వస్తుంది. దాన్నే బాగు చేయించుకుని క్యాబ్ సర్వీస్ మొదలుపెడతాడు శివ. అదొచ్చాక శివకు బాగా కలిసొస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కారులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందులో దయ్యం ఉందని తెలుసుకుంటాడు విజయ్. ఇంతకీ ఆ దయ్యం కథేంటి.. దానికి కారుకు సంబంధమేంటి.. ఈ దయ్యం గొడవ నుంచి బయట పడటానికి శివ ఏం చేశాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హార్రర్ థ్రిల్లర్.. ఎప్పటికీ  ఔట్ డేట్ కాని జానర్. కాకపోతే గత దశాబ్దంలో ‘హార్రర్ థ్రిల్లర్’లో ‘థ్రిల్లర్’ తీసేసి ‘కామెడీ’ చేర్చి బాగా అరగదీసేశారు. హార్రర్ కామెడీ అంటేనే బెంబేలెత్తిపోయేలా చేశారు. ఇలాంటి తరుణంలో యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్, కొత్త రైటర్ సాయికుమార్ రెడ్డి తో  హార్రర్ జానర్ నుంచి పక్కకు వెళ్లకుండా ‘ట్యాక్సీవాలా’ సినిమా తీశాడు. సూపర్ నేచురల్ ఎలిమెంట్ ను కొంచెం సైంటిఫిక్ వేలో చెప్పే ప్రయత్నమూ చేయడం ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచే ప్రయత్నమూ చేశాడు. అలాగని ఇదేమీ పూర్తి సీరియస్ సినిమా కాదు. మంచి  సిచువేషనల్ కామెడీతో  వినోదమూ పంచాడు.

విజయ్ చెప్పినట్లు ‘పెళ్ళిచూపులు’లో ప్రియదర్శి.. ‘అర్జున్ రెడ్డి’లో రాహుల్ రామకృష్ణ తరహాలో మరో కొత్త కమెడియన్ ‘ట్యాక్సీవాలా’లో మెరిశాడు. విష్ణు అనే కొత్త కుర్రాడు చాలా క్యాజువల్ గా భలే వినోదం పంచాడు. అతడితో పాటు మధునందన్ కూడా మెరిశాడు. వీళ్ల కామెడీకి తోడు విజయ్ వన్ లైనర్స్ కూడా భలేగా పేలాయి.

నటీనటులు:

విజయ్ దేవరకొండ మరోసారి మెప్పించాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘గీత గోవిందం’లో మాదిరే.. ‘సాధారణమైన’ పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. సినిమా మొదలైన కొంత సేపటికే విజయ్ కి ఉన్న ఇమేజ్ అంతా పక్కకు వెళ్లిపోతుంది. ఒక ట్యాక్సీ డ్రైవర్ గానే చూస్తాం అతడిని. స్టైలింగ్ అదీ మరీ మోడర్న్ గా ఉండటం ఇబ్బందే కానీ.. బాడీ లాంగ్వేజ్.. పెర్ఫామెన్స్ పరంగా విజయ్ పర్ఫెక్ట్ గా చేశాడు. సహజమైన నటనతో.. తనదైన శైలి డైలాగ్ డెలివరీతో విజయ్ మెప్పించాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ చూడ్డానికి క్యూట్ గా ఉంది. మాళవిక నాయర్ కు స్క్రీన్ టైం తక్కువే అయినా కీలకమైన పాత్ర కావడంతో ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. హీరో స్నేహితులుగా మధునందన్ తో పాటు కొత్త కుర్రాడు విష్ణు అదరగొట్టారు. సినిమాలో కామెడీ క్రెడిట్ ప్రధానంగా వీళ్లిద్దరిదే. చమ్మక్ చంద్ర కూడా ఉన్న కాసేపు నవ్వించాడు. విలన్ పాత్రలో సిజ్జు . రవి వర్మ.. యమున.. రవిప్రకాష్.. కళ్యాణి.. ఉత్తేజ్ వాళ్ళ  పాత్రల్లో మెప్పించారు.

సాంకేతికవర్గం:

‘ట్యాక్సీవాలా’ లాంటి సినిమాలో సాంకేతిక నిపుణుల పాత్ర కీలకం. టెక్నీషియన్లందరూ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. జేక్ బిజోయ్ నేపథ్య సంగీతం, సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద అస్సెట్.  ఎడిటింగ్.. ఆర్ట్ వర్క్ కూడా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాలకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్.. రచయిత సాయికుమార్ రెడ్డి తమ పనితనం చూపించారు. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపిస్తుంది. మాటలన్నీ సందర్భానుసారం వచ్చేవే. రాహుల్ హార్రర్ థ్రిల్లర్లను బాగా డీల్ చేయగలనని చాటుకున్నాడు. అతను ఈ తరం దర్శకుడని సినిమాలో చాలా చోట్ల తెలుస్తుంది. సిచువేషనల్ కామెడీ పండించడంలో.. కథకు కీలకమైన సన్నివేశాల్ని డీల్ చేయడంలో అతడి పనితనం కనిపిస్తుంది.